గత ఆర్థిక సంవత్సరానికి(2024-25)గాను ఎలాంటి జరిమానాలు లేకుండా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 15వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఇప్పటికే దాదాపు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఐటీ విభాగం పేర్కొంది. పన్ను చెల్లింపుదారులకు, పన్ను నిపుణులకు సందేహాలు తీర్చేందుకు వారంలో 24 గంటల పాటు పని చేసేలా సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించింది.
ఇ-వెరిఫై అయిన రిటర్నులు 5.51 కోట్లు ఉన్నాయని, ఇందులో 3.78 కోట్ల వరకూ పరిశీలన పూర్తయ్యిందని పన్ను విభాగం పేర్కొంది. రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉన్న వారందరూ త్వరగా రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది. కొత్త, పాత పన్ను విధానంలో ఏది ప్రయోజనమో చూసుకోవాలని తెలిపింది. మోసపూరిత మినహాయింపులు చూపించి, రిఫండును కోరడం తప్పు అని, తర్వాత కాలంలో ఇది నోటీసులకు, జరిమానాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తోంది.