Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీఎస్టీ పన్ను విధానంలో భారీ మార్పులు - లగ్జరీ వస్తువులపై 40 శాతం పన్ను: కేంద్రం నిర్ణయం

Advertiesment
gst - nirmala sitharaman

ఠాగూర్

, గురువారం, 4 సెప్టెంబరు 2025 (12:08 IST)
ప్రస్తుతం అమల్లో ఉన్న జీఎస్టీ పన్ను విధానంలో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. విలాస వస్తువులపై పన్ను భారాన్ని 40 శాతానికి పెంచాలని నిర్ణయించింది. అలాగే, పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేస్తూ, ఇప్పటివరకు ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం రెండే శ్లాబులను తీసుకొచ్చింది. అదేసమయంలో విలాసవంతమైన, హానికరమైన వస్తువులపై (సిన్ అండ్ సూపర్ లగ్జరీ గూడ్స్) ఏకంగా 40 శాతం ప్రత్యేక పన్ను విధించాలని నిర్ణయించింది.
 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటివరకు అమల్లో ఉన్న 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేశారు. ఇకపై దేశంలో 5 శాతం, 18 శాతం జీఎస్టీ శ్లాబులు మాత్రమే కొనసాగుతాయి. ఈ మార్పులతో సబ్బుల నుంచి చిన్న కార్ల వరకు అనేక నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, సామాన్యుడికి ఊరట లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
 
కొత్తగా ప్రవేశపెట్టిన 40 శాతం పన్ను శ్లాబు పరిధిలోకి పలు వస్తువులను చేర్చారు. పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు శీతల పానీయాలు (చక్కెర కలిపినవి), కెఫిన్ ఉన్న నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్‌పై పన్నును 28 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచారు.
 
వాహనాల విషయానికొస్తే, 1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, 4000 మిల్లీమీటర్ల కంటే పొడవైన అన్ని ఆటోమొబైల్స్‌పై 40 శాతం జీఎస్టీ వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న మోటార్ సైకిళ్లు, రేసింగ్ కార్లు, వ్యక్తిగత పడవలు (యాట్స్), ప్రైవేట్ విమానాలపై కూడా ఇదే పన్ను వర్తిస్తుంది.
 
పొగాకు ఉత్పత్తులు మినహా, మిగిలిన అన్ని కొత్త పన్ను రేట్లు ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. ఈ సంస్కరణలు ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు ముఖ్యంగా చిన్న వ్యాపారులకు వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

KA Paul: కవితకు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్.. ప్రజాశాంతిలో చేరుతుందా? (video)