Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అర శతాబ్దంలో ఇలాంటి వర్షాలు చూడలేదు : సీఎం సుఖు

floods
, సోమవారం, 10 జులై 2023 (17:55 IST)
గత 50 యేళ్ళ కాలంలో ఇలాంటి వర్షాలను చూడలేదని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. భారీ వర్షాల కారణంగా గత రెండు రోజుల్లోనే 17మంది వరకు మృతిచెందారని తెలిపారు. చందర్తాల్ వద్ద, లాహౌల్, స్పితిలోని పాగల్, తేల్గి నల్లా మధ్య చిక్కుకుపోయిన 400 మంది పర్యాటకులు, స్థానికుల్ని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. 
 
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌, భాజపా జాతీయ అధ్యక్షులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. ఇక్కడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారని సీఎం తెలిపారు. సీఎం సుఖు సోమవారం హమిర్‌పుర్‌లో మీడియాతో మాట్లాడారు. బడ్డి, కులు, ఉనా ప్రాంతాల్లో పలు వంతెనలు తెగిపోయాయని.. కులులోని లార్గి పవర్‌ ప్రాజెక్టు నీటిలో మునిగిపోయిందని వెల్లడించారు. 
 
ఉత్తరాదిన వర్ష బీభత్సం.. 
 
ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కాశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. యమున, గంగానదితో సహా పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీకి వరద హెచ్చరికలు జారీ చేశారు.
 
సోమవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నదిలో నీటి మట్టం 203.33 మీటర్లను తాకింది. హర్యానాలోని హతిన్‌కుంద్‌ బ్యారేజ్‌ నుంచి ఈ ఉదయం యమునా నదిలోకి 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నీటిమట్టం పెరిగింది. ఈ నది నీటిమట్టం ప్రమాదకర స్థాయి 204.50మీటర్లు. దీంతో ఏ క్షణానైనా యమునా నది ఉప్పొంగి ఢిల్లీని వరదలు ముంచెత్తవచ్చని హెచ్చరించారు. 
 
దీంతో యంత్రాంగం అప్పమత్తమైంది. ఢిల్లీ సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే 16 కంట్రోల్‌ రూంలను ఏర్పాటుచేశారు. ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్‌లలో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఢిల్లీలో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ను తాత్కాలికంగా మూసివేశారు.
 
అలాగే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. బియాస్ నది వరదలతో తీరం కోతకు గురై, నది ఒడ్డున నిర్మించిన పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మనాలిలో ఫ్లాష్ ప్లడ్స్ కారణంగా పలు దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. కులూ, కిన్నౌర్, ఛంబ ప్రాంతాలలో పొలాలు నీట మునిగాయి. 
 
కులూలో వరదలకు జాతీయ రహదారి కొంత భాగం కొట్టుకుపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారితో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 765 రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

razr 40 అల్ట్రా, razr 40ని ఆవిష్కరించిన మోటరోలా