మహారాష్ట్రలో ఘోరం జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని ముంబై నగరంలోని నాయక్ నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాల కింద మరో 40 మంది వరకు చిక్కుకున్నట్టు సమాచారం. ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మంది రెస్క్యూ టీం సురక్షితంగా రక్షించింది. అయితే, శిథిలాల కింద చిక్కుకుని 19 మంది చనిపోయారు.
ఈ భవనం కూలిపోవడానికి ముందే శిథిలావస్థకు చేరుకునివుందని ముంబై కార్పొరేషన్ అధికారులు అంటున్నారు. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు. అయితే, ఇందులోని వారు ఖాళీ చేయకుండా అక్కడే ఉండిపోయారని, ఇపుడు భవనం కూలిపోవడంతో ఈ ఘోరం జరిగిందని అధికారులు చెబుతున్నారు.