మహారాష్ట్ర రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. మహరాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ భగవత్ సింగ్ కోశ్యారి డెడ్‌లైన్ విధించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం మెజార్టీని నిరూపించుకోవాలని ఆయన కోరారు. దీంతో గురువారం సాయంత్రం 5 గంటలలోపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భవితవ్యం తేలిపోనుంది.
అధికార శివేసన పార్టీలో వచ్చిన చీలికల కారణంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు కొందరు ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా కొత్త శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మహారాష్ట్ర సర్కారు మైనార్టీలో పడిపోయింది. ఏక్‌నాథ్ షిండే వెంట 40 మందికిపై పాగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈ నేపథ్యంలో బలపరీక్షకు గవర్నర్ కోశ్యారి ఆదేశించండంతో గురువారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఇది ఒకే అజెండాతో అసెంబ్లీ సమావేశం అవుతుందని రాజ్‌భవన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
ఇదిలావుంటే బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ముంబైకు చేరుకుని గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మైనార్టీలో ఉందని, మెజార్టీ నిరూపించుకునేలా ఆదేశించాలని కోరారు. దీంతో గవర్నర్ అసెంబ్లీలో బలనిరూపణకు ఆదేశించారు.