గవర్నర్ తమిళిసై తాజాగా.. ఆపదలో ఉన్న సాధారణ విమాన ప్రయాణీకుడిని కాపాడారు. వివరాల్లోకి వెళితే.. గవర్నర్ తమిళసై వారణాసికి వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో ఢిల్లీ- హైదరాబాద్ విమానంలో బయల్దేరారు. అర్థరాత్రి వేళ ప్రయాణిస్తున్న ఆ విమానంలో సాధారణ ప్రయాణీకురాలు లాగానే తమిళసై తోటి ప్రయాణీకులతో పాటుగా కూర్చుకున్నారు.
ఆ సమయంలో ఒక ప్రయాణీకుడు అస్వస్థతకు గురయ్యారు. తనకు ఛాతీ నొప్పిగా ఉందని, గాలి ఆడటం లేదని విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే విమాన సిబ్బంది ప్రయాణీకుల్లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అంటూ అనౌన్స్ మెంట్ ద్వారా ప్రశ్నించారు.
దీంతో వెంటనే ప్రయాణీకుల్లో ఉన్న గవర్నర్ తమిళసై స్పందించారు. వెంటనే ప్రయాణీకుడికి బీపీ చెక్ చేయటంతో పాటుగా.. ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో ఆయన వెంటనే తేరుకున్నారు. కావాల్సిన మందులు అందించారు.
వెంటనే స్పందించి చికిత్స అందించటంతో విమానంలోని తోటి ప్రయాణీకులు.. చికిత్స అందుకున్న వ్యక్తి సైతం ధన్యవాదాలు చెప్పారు. అనౌన్స్ మెంట్ ద్వారా విమాన సిబ్బంది ప్రత్యేకంగా ప్రశంసించారు. హైదరాబాద్‌లో దిగిన వెంటనే ఆ ప్రయాణీకుడిని వీల్ ఛైర్‌లో విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించారు.
గవర్నర్ తమిళసై ముందు వైద్య విద్య పూర్తిచేసారు. ఎంబీబీఎస్ చేసి..డీజీఓలో ఎండీ పట్టా అందుకున్నారు. కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ విమానంలో ఉన్న పలువురు గవర్నర్ ఆ వ్యక్తికి చికిత్స అందిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభినందిస్తున్నారు.