మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. దీన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్‌భవన్‌లో సోమవారం మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో సాధారణ మహిళలకే కాదు అత్యున్నత పదవుల్లో ఉన్న మహిళలకు కూడా గౌరవరం దక్కడం లేదన్నారు.
అయినా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదైనా సాధించాలనే తపనతో ముందుకు సాగాలను ఆమె మహిళా లోకానికి పిలుపునిచ్చారు. అత్యున్నత పదవిలో ఉన్న వారికి కూడా సరైన గౌరవం దక్కడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక తనను ఎవరూ భయపెట్టలేరని, తాను దేనికీ భయపడను కూడా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాకుండా, "కేవలం ఆధిపత్యం ఉన్న పురుషుల రెక్కలతో, దేశ పక్షి ఎగరదు. ఈ రోజు మనం వివక్షను అనుభవిస్తున్నాము. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ, మేము కూడా వివక్షను ఎదుర్కొంటున్నాం. భారతీయ స్త్రీ ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన స్త్రీ అని ఆమె వ్యాఖ్యానించారు.
గవర్నర్ తమిళిసై ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాంకేతి కారణాలను చూపి బీజేపీకి చెందిన తమిళిసైను తెరాస ప్రభుత్వం అసెంబ్లీకి ఆహ్వానించలేదు. దీనిపై ఆమె గుర్రుగా ఉన్నారు.