Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జీ20 సదస్సుకు సిద్దమైన హస్తినాపురి : భారత్‌కు బయలుదేరిన ప్రపంచాధినేతలు

g20summit
, శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (11:54 IST)
జి20 శిఖరాగ్ర సదస్సుకు హస్తినాపురి (దేశ రాజధాని ఢిల్లీ) సిద్ధమైంది. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు పలు ప్రపంచ దేశాధినేతలు ఢిల్లీకి ఇప్పటికే చేరుకోగా మరికొందరు తమ దేశాల నుంచి పయనమయ్యారు. దీంతో ఢిల్లీలో సందడి వాతావరణం నెలకొంది. ఇటు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా భారత్‌ బయల్దేరారు. ఈ సాయంత్రానికి ఆయన ఢిల్లీ చేరుకోనున్నారు. అటు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ కూడా మధ్యాహ్నానికి రానున్నారు.
 
ఇదిలావుంటే, శుక్రవారం రాత్రి 7గంటలకు ఢిల్లీకి చేరుకునే బైడెన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ స్వాగతం పలకనున్నారు. రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ద్వైపాక్షిక భేటీలో పాల్గొంటారు. ఇక, బైడెన్‌ సతీమణి జిల్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌ బయల్దేరే గంట ముందు కూడా అధ్యక్షుడికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్‌ వచ్చినట్లు వైట్‌హౌస్‌ వెల్లడించింది. అయినప్పటికీ.. ఢిల్లీ పర్యటనలో ఆయన కోవిడ్ నిబంధనలు పాటించనున్నారు. 
 
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బైడెన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానంలో బైడెన్‌తో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలీవాన్‌, ఇతర ఉన్నాధికారులు ఉన్నారు. 'అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం జరుగుతున్న కీలక జీ-20 సదస్సులో అమెరికన్ల ప్రయోజనాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల పురగోతిపై మేం దృష్టిసారిస్తాం' అని భారత్ బయలుదేరేముందు బైడెన్ ట్వీట్ చేశారు.
 
అలాగే, బ్రిటన్‌ ప్రధానమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన రిషి సునాక్‌ కూడా శుక్రవారం మధ్యాహ్నానికి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ భారత సంతతి నేత యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన దేశానికి రావడం ఇదే తొలిసారి. ఢిల్లీ విమానాశ్రయంలో రిషి సునాక్‌కు కేంద్రమంత్రి అశ్వనీ చౌబే స్వాగతం పలుకుతారు. అటు సునాక్‌ బంధువులు కూడా ఆయనను ఆహ్వానించేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.
 
మరోవైపు, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనా కూడా శుక్రవారం మధ్యాహ్నానికి భారత్‌ చేరుకోనున్నారు. ఇప్పటికే అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెజ్‌ హస్తినకు చేరుకోగా, కేంద్రమంత్రి ఫగన్‌ సింగ్ కులస్థే ఆయనుక స్వాగతం పలికారు.
 
ఇదిలావుంటే, స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో శాంషెజ్‌ కరోనా బారినపడ్డారు. గురువారం ఆయనకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ జీ-20 సదస్సుకు రాలేనని వెల్లడించారు. దీంతో ఆయన స్థానంలో స్పెయిన్‌ ఉపాధ్యక్షురాలు నడియా కాల్వినో శాంటామారియా, విదేశాంగ మంత్రి జోస్‌ మాన్యూల్‌ అల్బరీస్‌ సదస్సుకు హాజరుకానున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకృతి విపత్తులకు మాంసాహార వినియోగమే కారణం : ఐఐటీ మండీ డైరెక్టర్