భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులపై తప్పుడు వరకట్న వేధింపులు లేదా అత్యాచార ఆరోపణలు చేయడం చాలా క్రూరమైనవని, ఇలాంటి వాటిని ఏమాత్రం క్షమించరాదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ వివాహ బంధానికైనా కలిసి జీవించడమే ముఖ్యమని, ఒక జంటలో ఏ ఒక్కరు విడిపోవాలని భావించినా ఆ బంధం ముందుకు సాగదని పేర్కొంది. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులపై ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మొదట ఫ్యామిలీ కోర్టులో విడాకుల డిక్రీకి సంబంధించి భర్తకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. దూరంగా ఉంటూ భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేయడంపై హైకోర్టు తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. 'ఈ జంట గత తొమ్మిదేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ మహిళ దూరంగా ఉంటున్న భర్తపై తప్పుడు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల ఆరోపణలు చేయడంతో పాటు అతడి కుటుంబ సభ్యులపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఇవన్నీ అబద్ధమని తేలింది. ఇది క్షమార్హం కాదు'అని జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణా ధర్మాసనం వ్యాఖ్యానించింది.