ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై జరిగిన దాడిపై కేంద్రం తీవ్రంగా పరిగణించింది. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై స్పందిస్తూ, రేఖా గుప్తాకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం ఉదయం సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. సీఎం భద్రత బాధ్యతలను ఢిల్లీ పోలీసుల నుంచి స్వీకరించాయి. సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మొహరించారు.
జడ్ కేటగిర్ భద్రతతో 20 మందితో పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనానలు ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు. కాగా, బుధవారం ఉదయం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ దాడి ఘటన జరిగిన విషయం తెల్సిందే. తన సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినట్టు నటించిన ఓ వ్యక్తి ఆమె చెంపపై కొట్టాడు. వెంటనే స్పందించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే, ఈ దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి రేఖా గుప్తాను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.