ఆస్ట్రేలియా ఎన్నికల తర్వాత వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ తలకిందులయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ గుర్తుచేశారు. దేశంలో ఏడు దశల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలన్నింటిలో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తేల్చాయి.
ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలపై శశిథరూర్ స్పందిస్తూ, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులవుతాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం తప్పేనని తాను ఖచ్చితంగా చెప్పగలనని వ్యాఖ్యానించారు. గత వారాంతంలో ఆస్ట్రేలియాలో వెల్లడైన 56 ఎగ్జిట్ పోల్స్ తప్పేనని తేలిపోయిందని గుర్తుచేశారు.
'అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అవుతాయని నేను భావించడం లేదు. గతవారం ఆస్ట్రేలియాలో 56 వివిధ ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్‌లో చాలా మంది ప్రజలు భయంతో తమ అంతరంగాన్ని సర్వేలు చేసే వారితో చెప్పుకోరు. తాము ఎవరికి ఓటు వేయబోతున్నామో, ఎవరికి వేశామో అనే నిజాన్ని చెప్పడానికి భయపడతారు. దీంతో, ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి. ఈ నేపథ్యంలో, ఫలితాల కోసం మే 23 వరకు వేచి చూడక తప్పదు' అని శశి థరూర్ అని చెప్పుకొచ్చారు.