వేసవి సెలవులు కావడంతో చెన్నై మెరీనా తీరానికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రంగుల రాట్నంలో ఆడుకుందామని వెళ్లిన ఆ చిన్నారి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు.
వివరాల్లోకి వెళితే.. చెన్నై మెరీనా బీచ్‌లో పద్మనాభన్ అనే వ్యక్తి పానీపూరీ స్టాల్ నడుపుతున్నాడు. ఇతని కుమారుడిని వేసవి కావడంతో బీచ్‌కు సాయంత్రం పూట తీసుకొచ్చాడు.
తండ్రితో పాటు పానీపూరీ స్టాల్ పక్కన కూర్చుని వుండిన ప్రణవ్ అనే ఆ చిన్నారి.. పక్కనే తిరుగుతున్న రంగుల రాట్నం వద్ద చూస్తూ నిల్చుండిపోయాడు.
ప్రణవ్‌ను చూసిన ఆ రంగుల రాట్నం నడిపే వ్యక్తి రాట్నానికి మధ్యలో పిల్లాడిని తీసుకెళ్లి తన పక్కనే నిలబెట్టుకున్నాడు. ఇలా రాట్నం తిరుగుతుండగా.. ప్రణవ్ దుస్తులు రాట్నంలో ఇరుక్కుంది.
దీంతో అదుపు తప్పడంతో రాట్నాన్ని వున్నట్టుండి ఆపలేకపోవడంతో ఆ చిన్నారి తలకు గాయం తగిలింది. తల భాగంగా దెబ్బ తగలడంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
కానీ అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.