మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేల కారణంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చారు. మనీలాండరింగ్ కేసులో కేసులో సంజయ్ రౌత్‌కు నోటీసులు జారీచేసింది. ఇందులోభాగంగా మంగళవారం హాజరు కావాలని ఆయను ఈడీ నోటీసులు జారీచేసింది.
మహారాష్ట్రలోని పాత్రచాల్ అభివృద్ధి ప్రాజెక్టులో భూకుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో సంజయ్ రౌత్‌కు సన్నిహితుడైన ప్రవీణ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అరెస్టు చేయడంతోపాటు ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది.
ఈ కేసులో సంజయ్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.2 కోట్ల విలువైన ఆస్తులను ఈ ఏప్రిల్‌లో ఈడీ జప్తు చేసింది. ఆయన భార్యపేరుమీదున్న అలీబాగ్‌లోని ఎనిమిది స్థలాలు, ముంబైలోని దాదర్ సబర్బన్‌లో ఓ ఫ్లాట్‌ను అటాచ్ చేసింది. తాజాగా ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమైన ఈడీ.. మంగళవారం హాజరుకావాలని ఆదేశించింది.
మరోవైపు, శివసేన అసమ్మతి నేతల తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో గత ఆరు రోజులుగా వేచిచూసే ధోరణి అవలంభిస్తోన్న రెబల్ నేతలు సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసిన 38 మంది రెబల్ ఎమ్మెల్యేలు.. ఇక సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడినట్లేనని అందులో పేర్కొన్నారు.