కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సమన్లు జారీచేశారు. మనీలాండరింగ్ కేసులో ఆయనకు గురువారం రాత్రి సమన్లు జారీ చేసి శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ అందులో పేర్కొన్నారు. దీనిపై డీకే శివకుమార్ స్పందించారు.
'నేను టెన్షన్ పడడం లేదు. ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం వంటి నేరం కానీ, ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఏమీ లేదు' అని అన్నారు.
అంతేకాకుండా 'నిన్న రాత్రి 9.40 గంటలకు ఈడీ సమన్లను అందుకున్నా. ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు విచారణకు హాజరుకావాలని అందులో ఉంది. విచారణకు హాజరుకావాలంటూ హఠాత్తుగా సమన్లు ఇవ్వడం సరైన చర్య కాకపోయినా... చట్టంపై ఉన్న గౌరవంతో నేను విచారణకు హాజరవుతాను. విచారణకు పూర్తిగా సహకరిస్తా' అని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
పైగా, తనకు రాజకీయ దురుద్దేశ్యంతోనే సమన్లు జారీ చేశారని చెప్పారు. తాను ఎలాంటి తప్పుకు పాల్పడలేదని స్పష్టం చేశారు. కాగా, గత కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ సర్కారులో ఈయన అత్యంత కీలక పాత్రను పోషించిన విషయం తెల్సిందే.