తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీలో పొమ్మనలేక తనకు పొగబెడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్. హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌లో చేరాలని తనకు ఆఫర్లు వచ్చాయన్నారు. తనను కొనే శక్తి ఎవరికి లేదన్నారు. బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
పార్టీ నాయకత్వాన్ని నిలదీస్తాననే కారణంగానే తనను పార్టీ నుండి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఒకవేళ తనను బయటకు వెళ్తే రాజీవ్ కాంగ్రెస్ పేరుతో పార్టీని పెడతానని ఆయన ప్రకటించారు.
అసెంబ్లీ, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపై ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించాలని తానే ధైర్యంగా ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్టీ వేదికలపైనే కాదు బయట కూడ ఈ విషయమై తాను మాట్లాడినట్టుగా ఆయన చెప్పారు.
ఇలా మాట్లాడడం పార్టీలో కొందరు నేతలకు నచ్చడం లేదన్నారు. ప్రశ్నిస్తున్నందునే తనను పార్టీ నుండి బయటకు పంపేందుకు పొమ్మనలేక పొగ పెడుతున్నారని వీహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. సర్వే సత్యనారాయణ, కొమిరెడ్డి రాములుపై చర్యలు తీసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.
రెడ్డి సామాజిక వర్గానికి చెందినందునే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ తనకు అన్నీ ఇచ్చింది.. అందుకే పార్టీని కాపాడుకొనేందుకు తాను చివరివరకు కష్టపడుతున్నట్టుగా ఆయన చెప్పారు.
పీసీసీ చీఫ్ పదవిని తనకు ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొస్తానని వీహెచ్ చెప్పారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకుండా కొందరు నేతలు తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కొప్పుల రాజు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారని వీహెచ్ విమర్శించారు.
తెలంగాణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొనే విషయాన్ని పార్టీ నేతలతో చర్చించారా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనట్టుగా ఆయన చెప్పారు.