Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ మూలస్తంభం నేలకొరిగింది... అహ్మద్ పటేల్ మృతిపై రాహుల్

కాంగ్రెస్ మూలస్తంభం నేలకొరిగింది... అహ్మద్ పటేల్ మృతిపై రాహుల్
, బుధవారం, 25 నవంబరు 2020 (08:50 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నే అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన మరణం పట్ల పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది నిజంగా విషాదకరమైన రోజుగా ఆయన అభివర్ణించారు. 
 
కాంగ్రెస్ పార్టీకి అహ్మద్ పటేల్ ఓ మూలస్తంభం లాంటివారని కొనియాడారు. ఆయన శ్వాస, ఆశ అన్నీ కాంగ్రెస్ పార్టీయేనని కీర్తించారు. అనేక సంక్షోభ సమయాల్లో పార్టీకి వెన్నంటి నిలిచారని తెలిపారు. తమకు ఆయన ఓ ఆస్తిలాంటివారని రాహుల్ అభివర్ణించారు. 'అలాంటి వ్యక్తి ఇక లేరు. ఆయన కుటుంబ సభ్యులు ఫైసల్, ముంతాజ్‌లకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
 
అటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా అహ్మద్ పటేల్ కన్నుమూత పట్ల స్పందించారు. అహ్మద్ పటేల్ ఓ తెలివైన, అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త అని కొనియాడారు. తాను సలహాల కోసం ఆయనను సంప్రదిస్తుంటానని వెల్లడించారు. ఓ స్నేహితుడిలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని, ఆయన మరణంతో శూన్యం ఆవహించినట్టయిందని తెలిపారు.
 
కాగా, నెల రోజుల కిందట కరోనా బారినపడిన అహ్మద్ పటేల్ కోలుకోలేకపోయారు. గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అహ్మద్ పటేల్ మృతి విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 
 
కరోనా ప్రభావంతో అవయవాలు బాగా దెబ్బతిని, మరణానికి దారితీసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు ఈ నెల 15 నుంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. తమ సీనియర్ నేత మృతితో కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది.
 
అహ్మద్ పటేల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ కోశాధికారిగా ఉన్నారు. అహ్మద్ పటేల్‌ను రాజకీయ దిగ్గజం అని చెప్పవచ్చు. ఇప్పటివరకు మూడు పర్యాయాలు లోక్‌సభకు, ఐదుసార్లు రాజ్యసభకు వెళ్లారు. 
 
1976లో గుజరాత్‌లోని బరూచ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల ద్వారా ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌లో తన విశిష్టత చాటుకున్నారు.
 
1985లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పటేల్ పార్లమెంటరీ కార్యదర్శిగా వ్యవహరించారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు పర్యవేక్షణ కోసం నియమితమైన నర్మదా మేనేజ్ మెంట్ అథారిటీ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బలాత్కారానికి పాల్పడితే నపుంసకుడిగా మార్చేస్తారు.. ఎక్కడ?