ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేరాలను అరికట్టేందుకు ఆయా దేశాలు ఎన్నో కఠిన చట్టాలు తీసుకొస్తున్నప్పటికీ.. పెద్ద ప్రయోజనం కనిపించడం లేదు. ముఖ్యంగా, ఇస్లామిక్ దేశాల్లో ఈ చట్టాలు మరింత కఠినంగా అమలవుతున్నప్పటికీ.. అక్కడ కూడా ఇవి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.
ఈ క్రమంలో పాకిస్థాన్ దేశం సరికొత్త చట్టానికి రూపకల్పన చేస్తోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం.
ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్‌లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు.