Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్బే... కుదరంటే కుదరదు.. అందులో వేలుపెట్టలేం : 'బీహార్‌'పై సుప్రీం

Advertiesment
Bihar Assembly Election
, శుక్రవారం, 28 ఆగస్టు 2020 (17:18 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బీహార్ అసెంబ్లీకి నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేయలేమని, అసలు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కోవిడ్ నుంచి బీహార్‌కు విముక్తి లభించేంత వరకూ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ అంశంపై ఏం చేయాలన్న దానిపై ఎన్నికల కమిషన్‌కు తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది.
 
ఎన్నికల నోటిఫికేషన్‌‌‌ జారీ కాకుండా ఆపాలని జస్టిస్ అశోక్ భూషణ్ సారథ్యంలోని బెంచ్ ముందు పిటిషనర్ తన వాదన వినిపించారు. దీనికి బెంచ్ స్పందిస్తూ 'ఎన్నికలు నిర్వహించవద్దని మేము ఈసీని ఎలా అడుగుతాం?' అని ప్రశ్నించింది. 
 
అసాధారణ పరిస్థితుల్లో ఎన్నికలను వాయిదా వేయవచ్చని ప్రజాప్రాతినిధ్యం చట్టం చెబుతోందని పిటిషనర్ వాదన చేశారు. దీనికి బెంచ్ అంతే సూటిగా స్పందించింది. దీనిపై ఈసీనే నిర్ణయం తీసుకోవాలని, అత్యున్నత న్యాయస్థానం కాదని స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించవద్దని ఈసీని ఆదేశించలేమని పునరుద్ఘాటించింది.
 
మనుషుల ప్రాణాలు ముఖ్యం కానీ, ఎన్నికలు కాదని, కరోనా వైరస్‌తో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ వాదించారు. దీనికి బెంచ్ స్పందిస్తూ, అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. బీహార్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా వెలువడనందున ఎన్నికల వాయిదాకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని కూడా బెంచ్ స్పష్టంచేసింది. 
 
బీహార్‌లో పరిస్థితికి (కోవిడ్) సంబంధించి ఎన్నికల కమిషన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్థ నుంచి నివేదిక కోరాలని కూడా పిటిషనర్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితిపై ఎన్నికల కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని, రిట్ ఈ విధంగా ఉండకూడదని బెంచ్ పేర్కొంటూ, పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'బాహుబలి'లో కట్టప్ప తప్పించుకోవచ్చు.. కానీ, ఈ కట్టప్ప దొరుకుతాడు : ఆర్ఆర్ఆర్