Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'బాహుబలి'లో కట్టప్ప తప్పించుకోవచ్చు.. కానీ, ఈ కట్టప్ప దొరుకుతాడు : ఆర్ఆర్ఆర్

'బాహుబలి'లో కట్టప్ప తప్పించుకోవచ్చు.. కానీ, ఈ కట్టప్ప దొరుకుతాడు : ఆర్ఆర్ఆర్
, శుక్రవారం, 28 ఆగస్టు 2020 (17:11 IST)
బాహుబలి చిత్రంలో వెన్నపోటుపొడిచిన కట్టప్ప రెండుసార్లు తప్పించుకున్నాడనీ, కానీ, ఆవ భూముల కొనుగోలులో జరిగిన అక్రమాల వెనుక ఉన్న కట్టప్ప మాత్రం తప్పించుకోలేడని వైకాపాకు చెందిన అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణంరాజు (ఆర్ఆర్ఆర్) జోస్యం చెప్పాడు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆవ భూముల కుంభకోణాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, వరదలకు మునిగిపోయే స్థలాలను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా భూములు మోకాలి లోతు నీళ్లలో మునగడం చూస్తుంటామని, కానీ ఆవ భూముల్లో 20 అడుగుల కర్ర పెడితే అది కూడా మునిగిపోయే పరిస్థితి కనిపిస్తోందని తెలిపారు.
 
ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసేందుకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని హైకోర్టు సీబీఐని కోరడం స్వాగతించదగ్గ పరిణామం అని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ప్రజలను మోసం చేస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, అధికారులతో కుమ్మక్కైన వారందరికీ ఇదొక చెంపపెట్టు కావాలని అన్నారు. 
 
ఆవ భూముల్లో ప్రాథమిక పనులకు రూ.300 కోట్ల వ్యయం అవుతోందని తెలిపారు. నీటిపారుదల శాఖ ఇచ్చిన లేఖ కూడా పక్కనబెట్టి ఆవ భూములు కేటాయిస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ కూడా విచారణలో వెల్లడవుతాయని తెలిపారు. ధనార్జనే లక్ష్యంగా ఆవ భూముల్లో కుంభకోణం జరిగిందనేది జగద్విదితం అని స్పష్టం చేశారు.
 
ఈ ఆవ భూముల వ్యవహారంలో ఓ కట్టప్ప ఉన్నాడని మనం ఇంతకుముందే చర్చించుకున్నామని, బాహుబలి రెండు సినిమాల్లో ఆ కట్టప్ప తప్పు చేసినా సరే బతికిపోయాడేమో కానీ, ఈ కట్టప్ప మాత్రం తప్పించుకోలేడని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఇప్పుడు అవినీతిపైనా కొత్త రూల్స్ వచ్చాయని, డబ్బులు ఇచ్చినవాడికి ఏడేళ్లు, తీసుకున్నవాడికి 35 ఏళ్లు శిక్ష పడుతుందని నరసాపురం ఎంపీ వ్యాఖ్యానించారు. 
 
ఆవ భూముల కేసును సీబీఐ విచారణ చేస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. సీఎం జగన్‌ తన పారదర్శకత నిరూపించుకోవాలన్నారు. మాటల్లోనే కాదు.. చేతల్లోనూ సూపర్‌ అని... జగన్‌ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తణుకు, ఆచంటలో జరిగిన అవినీతిపై విచారణ చేయించాలని, రూ.500 కోట్ల నష్టానికి బాధ్యులెవరని సీఎంను ప్రశ్నిస్తున్నానని రఘురామ అన్నారు.
 
అంబటి కృష్ణారెడ్డికి కేబినెట్‌ హోదా కల్పించారని రఘురామకృష్ణం రాజు అన్నారు. కులాన్ని బట్టి పోస్టు కాదని.. అర్హతలను బట్టి పోస్టులు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన సలహాదారులను తగ్గిస్తే మంచిదని.. ఇది తన అభిప్రాయం కాదని.. ప్రజాభిప్రాయమని రఘురామ వ్యాఖ్యానించారు.
 
రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. పరిస్థితి ఇలాగేకొనసాగితే బిల్డర్లు ఆత్మహత్య చేసుకోవడమేనని, భవన కార్మికులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ‘పెయిడ్‌ ఆర్టికల్స్‌ నిజం కావు, మన పేపర్‌లో వచ్చేవన్నీ నిజం కావు, మీరు అన్ని సమస్యలను పరిష్కరించగలరన్న నమ్మకముందని’ రఘురామ వ్యాఖ్యానించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దూకగానే లోపలికి పోవడమేగానీ.. బయటకు వచ్చే పరిస్థితిలేదు... ఎక్కడ?