పంజాబ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు ఓ సరికొత్త విప్లవం సృష్టించారని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ 91 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్ ప్రజలు ఓటుతో విప్లవరం సృష్టించారంటూ వారికి అభినందనలు తెలిపారు. ఆ రాష్ట్ర ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
మాన్‌తో కలిసి విక్టరీ సింబల్ చూపిస్తున్న ఫోటోను కూడా కేజ్రీవాల్ మీడియాకు షేర్ చేశారు. ఎన్నికల ఫలితాల సరళి స్పష్టమైన దశకు చేరుకోగానే కేజ్రీవాల్ ఢిల్లీలో హనుమాన్ జంక్షన్ ఆలయాన్ని సందర్శించారు. పంజాబ్‌లో తమ పార్టీ ఘన విజయంపై దేవుడి ఆశీస్సులు అందుకున్నారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడం, ఏమాత్రం ఛరిష్మా లేని చరణ్ జిత్ చన్నీని కాంగ్రెస్ హైకమాండ్ సీఎంని చేయడం, పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాయి. ఫలితంగా మరో రాష్ట్రంలో అధికారానికి దూరమైంది.