పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తుంది. ఇందులోభాగంగా ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇపుడు నెటిజన్లకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియోలను నెటిజన్లు షేర్ చేయాల్సి వుంటుంది. అలా ఎవరి వీడియోలైతే వైరల్ అవుతాయో వారిలోని 50 మందిని ఎంపిక చేసి వారితో డిన్నర్ చేస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు కూడా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా షేర్ చేస్తున్నారు.
మరోవైపు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల, పంజాబ్, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే. అయితే, ప్రత్యక్ష ఎన్నికల ప్రచారాన్ని నెలాఖరు వరకు ఈసీ నిషేధం విధించింది. దీనికి కారణం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటమే. దీంతో సోషల్ మీడియా వేదిక ద్వారా అన్ని రాజకీయా పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.