Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దురాశ దుఃఖానికి చేటు అంటారు, ఎందుకో చూడండి

దురాశ దుఃఖానికి చేటు అంటారు, ఎందుకో చూడండి
, ఆదివారం, 12 జులై 2020 (22:37 IST)
అడిగింది అడిగినట్లు ఇచ్చేవారున్నప్పుడు మనిషుల్లో అత్యాశలు కలుగుతుంటాయి. ఈ అత్యాశ వల్ల మనిషి వివేకాన్ని కోల్పోతాడు. చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ అత్యాశ  అనేక రకాల అనార్థాలకు దారితీస్తుంది. అత్యాశ వలన ఉన్నది పోగొట్టుకునే అవకాశం ఉంది. దీనివలన కలిగే నష్టాలేమిటో తెలియజేసే కథను చూద్దాం. ఒక ఊరిలో ఒక పేదవాడు ఎంతోకాలం తపస్సు చేసి దేవతానుగ్రహంతో మూడు వరాలను పొందాడు. ఒక్కో వరం కోరుకున్నప్పుడు అతడు ఒకసారి పాచికలను దొర్లించాలని దేవత నియమం. 
 
అతడు బ్రహ్మానందం పొంది, ఇంటికి వెళ్లి భార్యకు తన మహాదృష్టాన్ని గూర్చి తెలుపగా ఆమె మెుట్టమెుదట ధనం కోసం పాచికలను విసరమని కోరింది. అందుకు అతడిలా అన్నాడు. మన ఇద్దరి చిన్నముక్కులు చాలా రోత కలిగిస్తున్నాయి. లోకులు మనలను చూసి నవ్వుతున్నారు. అందుచేత చక్కని కొనదేరిన ముక్కుకోసం మెుట్టమెుదట పాచికలను దొర్లిద్దాం అన్నాడు. ఐతే అతడి భార్య అన్నింటికంటే ముందు ధనం కావాలని పట్టుపట్టి అతడు పాచికలను దొర్లించకుండా చేతిని పట్టుకుంది. 
 
కానీ అతగాడు వెంటనే చేతిని వెనుకకు తీసుకొని మా ఇద్దరికి చక్కని ముక్కులు లభించుగాక. ముక్కులే మరేమీ వద్దు అంటూ తొందరగా పాచికలను దొర్లించాడు. తక్షణమే వారి శరీరాలు మెుత్తం చక్కని ముక్కులతో నిండిపోయాయి. కాని అవి వారికి పరమ ఉపద్రవాలై దుర్భరమవటంతో మహాప్రభూ... మాకు ఈ ముక్కులు తొలగుగాక... అంటూ రెండవసారి పాచికలను దొర్లించడానికి ఇద్దరూ ఒప్పుకున్నారు. 
 
దొర్లించారో లేదో ఇద్దరికి మెుదట ఉన్న ముక్కులు కూడా ఊడిపోయాయి. ఈవిధంగా వారు రెండు వరాలను వృధాపుచ్చారు. ఏం చేయడానికి వారికి పాలుపోలేదు. ఒక్క వరమే ఇక మిగిలిఉంది. ముక్కులు ఊడిపోవటంతో మునుపటికంటే వారు మరింత కురూపులుగా కనిపించసాగారు. లోకాన్ని ఏ ముఖం పెట్టుకొని చూస్తామో అని వారు వాపోయారు.
 
వారు తమకు చక్కని ముక్కులు కావాలని కోరుకున్న లోకులు తమకు ఏర్పడ్డ వికృత రూపాన్ని గురించి ఏమని అడిగిపోతారో.. మూడు వరాలతోనైనా పరిస్ధితులను చక్కబెట్టుకోలేని మూర్ఖులని తమను చూసి లోకులు ఎక్కడ నవ్విపోతారో అని వారు భయపడ్డారు. కాబట్టి వారిద్దరు తమ ఎప్పటి వికారపు చిన్నముక్కులనే తిరిగి పొందడానికి సమ్మతించి పాచికలను దొర్లించారు. చూశారా అత్యాశ వల్ల ఎంత అనర్థం జరిగిందో... అత్యాశ వలన ఎవరైనాసరే వచ్చిన అదృష్టాన్ని పొందలేరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గులాబీలు- మల్లెలు సౌందర్యానికే కాదు ఆరోగ్యానికి కూడా..