ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌తో పాటు హెచ్‌సీఎల్ వంటి సంస్థలు ఇప్పటికే పదోన్నతులు, బోనస్‌లు ఇస్తున్నాయి. ప్రధానంగా నిపుణుల్ని అట్టిపెట్టుకునేందుకు ఐటీ సంస్థలు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి.
ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బెంజ్ కారును ఆఫర్ చేయాలని ప్రతిపాదించింది. బోర్డు నుండి అనుమతి రాగానే ఈ ప్రతిపాదనను అమలు చేయనున్నట్లు హెచ్‌సీఎల్ చీఫ్ హెచ్ఆర్ వీవీ అప్పారావు తెలిపారు.
ప్రతిభావంతులకు మెర్సిడెజ్ బెంజ్ కారును బహుమతిగా పొందే అవకాశం కల్పించాలనుకుంటున్నామని, బోర్డ్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నట్లు వివి అప్పారావు తెలిపారు. 2013లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 50 మంది ప్రతిభావంతులకు మెర్సిడెస్ బెంజ్ కార్లను అందించింది.
జావా డెవలపర్ వంటి నిపుణులు కంపెనీ ఇస్తున్న వేతనాలకు దొరుకుతున్నప్పటికీ, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు లభించడం లేదన్నారు. FY22లో 22వేల కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు HCL టెక్నాలజీస్ ఇదివరకే తెలిపింది. ఈ సంస్థలో వలసల రేటు 11.8 శాతంగా ఉంది.
ఐటీ సంస్థలకు వరుసగా ప్రాజెక్టులు వస్తున్నాయి. దీంతో నిపుణులను అట్టిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొత్త ఉద్యోగులు ఎలా పని చేస్తారో తెలియదు. నైపుణ్యం తెలియదు. అందుకే పాతవారికే పెద్ద పీట వేస్తున్నాయి.
అందుకే ప్రతిభావంతులకు హెచ్‌సీఎల్ టెక్ మెర్సిడెజ్ కారు ఇస్తామని ప్రకటించగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వేతన పెంపు, బోనస్, ప్రమోషన్ ఇస్తామని చెబుతున్నాయి. అన్ని రంగాలు డిజిటలైజ్ దిశగా సాగుతున్నాయి.