అంత్యక్రియలు చేస్తుండగా మృతదేహాలు లేచి కూర్చోవడం.. తిరిగి శ్వాస రావడం వంటి వార్తలు వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరాచీలో అనారోగ్యంతో బాధపడుతున్న రషీదా బీబీ అనే మహిళను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో.. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె డెత్ సర్టిఫికేట్‌ను కూడా ఇచ్చేశారు. దీంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే అంత్యక్రియల్లోనే షాకిచ్చే సంఘటన చోటుచేసుకుంది. అంత్యక్రియల్లో భాగంగా రషీదా బీబీ మృతదేహానికి స్నానం చేయిస్తుండగా.. ఒక్కసారిగా ఆమె లేచి నిలబడింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు.
వెంటనే ఆమెను పరీక్షించేందుకు డాక్టర్లను రప్పించారు రషీదా బీబీ కుటుంబ సభ్యులు. వారు పల్స్ చెక్ చేయడంతో ఆమె శ్వాస తీసుకుంటుందని ఆరోగ్యానికి ఢోకాలేదని తెలిపారు. ఆపై చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.