రష్యాలో సంభవించిన బొగ్గు గని ప్రమాదంలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఆరుగురు రెస్క్యూ సిబ్బంది కూడా వున్నారు. గనిలో మీథేన్ వాయువు లీకై పేలుడు సంభవించడంతో బొగ్గుకు మంటలు అంటుకున్నాయి.
ప్రమాద సమయంలో గనిలో భారీ ఎత్తున విష వాయువులు విడుదలయ్యాయి. దీంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకూ 14 మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. మరో 38 మంది మృతదేహాలను వెలికితీయాల్సి ఉంది.
ప్రస్తుతం గని మొత్తం మీథేన్, కార్బన్ మోనాక్సైడ్ విష వాయువులతో నిండిపోవడంతో సహాయక చర్యలను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.
ప్రమాద సమయంలో గనిలో మొత్తం 285 మంది కార్మికులు విధుల్లో ఉండగా 239 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు తెలిపారు. వీరిలో 49 మంది గాయపడినట్లు పేర్కొన్నారు.