భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది.
తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ అన్నారు. పాక్ టీవీ సామా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్‌పై భారత్ దాడికి దిగితే సంప్రదాయ యుద్ధానికి అవకాశం లేదని, ఇది భీకరంగా సాగే అణుయుద్ధానికి దారితీస్తుందని అన్నారు.
పాకిస్తాన్ సంప్రదాయ యుద్ధానికి దిగే అవకాశం లేదని, దీంతో ఏదైనా జరిగితే పొరుగు దేశం అంతమవుతుందని భారత్ గుర్తెరగాలని ఆయన హెచ్చరించారు.
కాగా పాకిస్తాన్ అణుయుద్ధం ప్రస్తావన తెస్తూ భారత్‌ను హెచ్చరించడం ఇదే తొలిసారి కాదు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం భారత్‌తో అణు యుద్ధంపై గత ఏడాది పలు సందర్భాల్లో మాట్లాడారు.
ఇక కశ్మీర్ అంశంపై చైనా మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కశ్మీర్ అంశంతో పాటు భారత్-చైనా సరిహద్దు ప్రతిష్టంభనలపైనా చర్చించేందుకు పాక్ విదేశాంగ మంత్రి మక్దూమ్ షా మహ్మద్ ఖురేషి బీజింగ్ పర్యటనకు బయలుదేరివెళ్లారు