బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా (79) తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఆమెకు గుండె, ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్టు వైద్యులు నిర్దారించారు. దీంతో ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. యాంటీ బయాటిక్స్‌తో సాయంతో చికిత్స అందిస్తున్నట్టు వారు వెల్లడించారు. అలాగే ఆమెకు వర్చువల్‌గా అమెరికా వైద్య నిపుణులు సైతం సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు.
గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆమెను కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి ఢాకాలోని ఎవర్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఖలీదా జియాకు యాంటీ బయాటిక్స్ సాయంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని, అయినప్పటికీ ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని, త్వరోనే మెరుగయ్యే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
కాగా, ఆమెకు అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ ఆస్పత్రి వైద్య నిపుణులు వర్చువల్‌గా వైద్య సహాయం అందిస్తున్నారు. ఆమెకు అందించే చికిత్సలో సూచనలు, సలహారు ఇస్తున్నారు. మరోవైపు, తమ అధినేత్రి అనారోగ్యానికి గురయ్యారనే వార్త తెలియగానే ఆమె అభిమానులు, బీఎన్పీ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆమె కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
మరోవైపు, పార్టీకి చెందిన ముఖ్య నేతలు, సుమా షమీలా రహ్మాన్ వంటివారు ఆస్పత్రి వద్దే ఉండి ఎప్పటికపుడు ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, ఖలీదా జియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెల్సిందే.