తాను కరోనా వైరస్ బారినపడటం దేవుడి దయ అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. కరోనా వైరస్ సంక్రమించడాన్ని ఆయన దేవుడి దీవెనతో పోల్చారు. వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్‌లో తనకు జరిగిన చికిత్స గురించి ట్రంప్ తన వీడియో ట్వీట్‌లో వివరించారు.
రీజెనరాన్ చికిత్స తీసుకున్నట్లు వెల్లడించిన ట్రంప్.. ఆ వైద్యం మారువేషంలో దేవుడి ఇచ్చిన ఆశీస్సులే అన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓవల్ ఆఫీసు ప్రాంగణంలో తీసిన 5 నిమిషాల వీడియోను ఆయన పోస్టు చేశారు. అయితే ఇదే రకమైన చికిత్సను ప్రతి అమెరికా పౌరుడికి అందించనున్నట్లు ఆయన చెప్పారు. మిలిటరీ హాస్పిటల్‌లో తాను తీసుకున్న చికిత్స తరహాలోనే ప్రతి అమెరికా పౌరుడికి చికిత్సను అందించనున్నట్లు చెప్పారు. ఉచితంగానే రీజెనరాన్ డ్రగ్స్‌ను ప్రతి ఒక్కరికీ అందించనున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా, రీజెనరాన్ ఫార్మసీ సంస్థ కోవిడ్19 చికిత్స కోసం యాంటీబాడీ ట్రీట్‌మెంట్ ఇస్తోంది. ప్రస్తుతానికి ఇది ట్రయల్స్ దశలోనే ఉన్నది. కానీ ట్రంప్ ఆ చికిత్స పొందినట్లు తన వీడియోలో చెప్పారు. యాంటీబాడీ కాక్‌టెయిల్ చికిత్స తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు కరోనా వల్ల చాలా నీరసంగా ఉన్నానని, కానీ రీజెనరాన్ చికిత్స తర్వాత తాను హుషారుగా కోలుకున్నట్లు వెల్లడించారు.
రెండు రకాల ఇంజెక్షన్లతో రీజెనరాన్ యాంటీబాడీ చికిత్స చేస్తారు. కోవిడ్19కు కారణమైన సార్స్ కోవ్-2 వైరస్ వ్యాప్తిని రీజెన్-కోవ్2 ఇంజెక్షన్లు అడ్డుకుంటాయి. ట్రంప్ ఇదే చికిత్స పొందారు. కోలుకున్నవారి యాంటీబాడీలతో రీజెనరాన్ ఇంజక్షన్లను తయారు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంటున్నది.