కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన కల్లోలం అంతా ఇంతాకాదు. గత మార్చి నెలాఖరు నుంచి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ వైరస్ దెబ్బకు వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. లక్షలాది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ అమలు చేయాల్సిన నిర్బంధ పరిస్థితికి చేరుకుంది. దీంతో రెండు మూడు నెలల పాటు లాక్డౌన్ అమలు చేశారు. అప్పటికీ ఈ వైరస్ వ్యాప్తి తగ్గలేదు. ఇకలాభం లేదని భావించిన కేంద్రం లాక్డౌన్ నిబంధనలు దశల వారీగా సడలించుకుంటూ వస్తున్నారు. అయితే, లాక్డౌన్ కారణంగా స్కూల్స్, థియేటర్స్, మాల్స్ మూతపడ్డాయి. ఇవి ఇంకా తెరుచుకోలేదు. అయితే, ఈ నెల 15వ తేదీ నుంచి వీటిని తెరుచుకునేందుకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. అయినప్పటకీ.. సినిమా హాళ్లు, స్కూల్స్ తెచురుకునే పరిస్థితి మాత్రం.
అయితే, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలలోబడి తెలంగాణ థియేటర్ల సంఘం, సినిమా హాల్స్‌ను తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ, 15 నుంచి వీటిని తెరవడానికి వీల్లేదని, రాష్ట్రంలో అన్‌లాక్ 5.0కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ, సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు.
ముఖ్యంగా, పాఠశాలలు, సినిమా హాల్స్ విషయంలో తొందరపడటం లేదని, వాటి పునఃప్రారంభంపై తేదీలను తదుపరి తెలుపుతూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక తన ఉత్తర్వుల్లో కాలేజీలు, విద్యా సంస్థలు ఆన్‌లైన్ లేదా దూర విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
కంటైన్మెంట్ జోన్లకు వెలుపల లాక్డౌన్‌కు ముందు అనుమతించిన అన్ని పనులను, ఇకపై కూడా అనుమతిస్తారు. కరోనా ప్రొటోకాల్‌ను పాటిస్తూ, స్విమ్మింగ్ పూల్స్, కమర్షియల్ ఎగ్జిబిషన్ వ్యాపారాలు, క్రీడాకారుల శిక్షణా కేంద్రాలను 15 నుంచి తెరచుకోవచ్చని ఆయన తెలిపారు. విద్య, క్రీడా, వినోద, సామాజిక, మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, కంటైన్మెంట్ జోన్ల బయట 100 మందికి మించకుండా చేసుకోవచ్చు.
అన్ని రకాల శుభకార్యాలు, అంత్యక్రియలకు కూడా 100 మందికి లోబడే అనుమతి ఉంటుంది. ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మైదానం విస్తీర్ణాన్ని బట్టి, అధిక సంఖ్యలో ఆహూతులను అనుమతించే అంశం స్థానిక కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలకు అప్పగిస్తూ ఆయన ఆదేశాలు జారీచేశారు.
ఇదిలావుంటే, రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి స్కూళ్లు తెరవడం సాధ్యం కాదని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. కరోనా నేపథ్యంలో విద్యావ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై ఉపసంఘం బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమైంది.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. విద్యాసంస్థలు ఎప్పుడు తెరిచేదీ దసరా తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే, యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా నవంబరు 1 నుంచి ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలలు మాత్రం తెరుస్తామన్నారు. పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.