దేశంలో కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా చేపట్టే నియంత్రణ చర్యలు పెద్దగా ఫలితమివ్వడం లేదు. ఈ కారణంగా కొత్త కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 78,524 కేసులు నమోదు కాగా, 971 మంది కరోనాతో మృతి చెందారు.
తాజా కేసులు, మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 68,35,656 కేసులు నమోదు కాగా, 1,05,526 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గురువారం బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఇంకా 9,02,425 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 58,27,705 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణాలో ఒకే రోజు 12 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రతి రోజూ కనీసం రెండు వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బుధవారం ఒక్క రోజే ఏకంగా 12 మంది మృత్యువాతపడ్డారు.
అలాగే, బుధవారం ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా 1,896 కేసులు బయటపడ్డాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు మొత్తం 2,06,644 మంది ఈ వైరస్ బారినపడినట్టు అయింది. అలాగే, 12 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 1,201కి పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ద్వారా తెలుస్తోంది.
మరోవైపు, మహమ్మారి బారినుంచి గత 24 గంటల్లో 2,067 మంది కోలుకున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,79,075కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 26,368 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 21,724 మంది ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 50,367 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వీటితో కలుపుకుని ఇప్పటివరకు 33,96,839 మందికి పరీక్షలు నిర్వహించారు.