అమెరికా సాయం నిలిపివేత.. ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్
దాయాదిదేశం పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకొనేవరకు ఎలాంటి రక్షణ సాయం చేయబోమని తేల్చిచెప్పింది.
దాయాదిదేశం పాకిస్థాన్‌కు అగ్రరాజ్యం అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకొనేవరకు ఎలాంటి రక్షణ సాయం చేయబోమని తేల్చిచెప్పింది. ఈ నిర్ణయంతో శత్రుదేశానికి అగ్రరాజ్యం చేస్తున్న 115 కోట్ల డాలర్ల (సుమారు రూ.7289 కోట్లు) సాయం ఆగిపోయింది.
ఆఫ్ఘన్ తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లను నిర్మూలించాలని అమెరికా స్పష్టం చేస్తూవస్తోంది. కానీ, పాక్ పాలకులు మాత్రం పెడచెవిన పెడుతూనే వస్తున్నారు. దీనిపై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అమెరికా నేతలను పిచ్చోళ్లను చేస్తూ పాకిస్థాన్ అబద్ధాలు చెబుతూ మోసం చేసిందంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా, ఇక ఏమాత్రం సాయం చేయబోమని కూడా ఆయన స్పష్టంచేశారు.
దీనిపై పాకిస్థాన్ గగ్గోలు పెడుతోంది. ఆర్థికంగా చితికిపోతామని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పనిలోపనిగా భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతోంది. భారత్ కుట్ర వల్లే అమెరికా ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తోంది.
మరోవైపు అమెరికా ఆర్థిక సాయాన్ని నిలిపి వేయడంతో పాక్ విలవిల్లాడుతోంది. పరిస్థితిని పూర్వస్థితికి తెచ్చేందుకు పాక్ ప్రధాని అబ్బాసీ చర్చోపచర్చలు జరుపుతున్నారు. పాక్ మిత్ర దేశం చైనా ఎప్పట్లానే తన ఒంటెద్దు పోకడలను ప్రదర్శించింది. పాకిస్థాన్ చాలా మంచి దేశమని... ఉగ్రవాదులపై పోరాటంలో భాగంగా ఎన్నో త్యాగాలు చేసిందని ప్రశంసించింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తోందని కితాబిచ్చింది.