బ్రిటన్‌లో కొత్త ప్రధాన మంత్రి కోసం వెతుకులాట ప్రారంభమైంది. ఇక వారం రోజుల్లో బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రి ఎవరనేది తేలిపోతుంది. కొద్ది నెలల క్రితం బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రధానిని ఎన్నుకునే తతంగానికి రెండు నెలల సమయం పట్టింది.
తాజాగా బ్రిటన్ ప్రధాని కోసం ఈ నెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. 650 సీట్లు గల బ్రిటిష్ పార్లమెంట్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ 357 మంది సభ్యులు వున్నారు. వారిలో ఎవరైనా సరే పార్టీ అధ్యక్ష పదవికీ, తద్వారా ప్రధాని పదవికీ పోటీపడవచ్చు.
ఇంతకుముందు నామినేషన్ వేసేందుకు 20మంది ఎంపీల మద్దతు వుంటే సరిపోయేది. ఈసారి కనీసం 100 మంది కన్జర్వేటివ్ ఎంపీ మద్దతు ఉన్నవారు మాత్రమే పోటీకి అర్హులని ప్రకటించారు. దీంతో ముగ్గురు నాయకులు మాత్రమే పార్టీ సారథ్యానికి పోటీపడగలుగుతారు.
అక్టోబర్ 24 మధ్యాహ్నం 2 గంటలతో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల లోపల పార్టీ ఎంపీలు ఓటు వేస్తారు.
ముగ్గురు అభ్యర్థులతో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో సాయంత్రం ఆరు గంటలకు ప్రకటిస్తారు. అందరికన్నా తక్కువ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్థి పోటీ నుంచి తప్పకోవాల్సిందే.