బోయింగ్ విమాన ప్రమాద ఘటనలో ఓ భారతీయ కుటుంబానికి కోర్టులో ఊరట లభించింది. 35.85 మిలియన్ డాలర్లు (రూ.317 కోట్లు) చెల్లించాలని విమాన తయారీ సంస్థను చికాగోలోని ఫెడరల్ కోర్టు ఆదేశించింది. ఆరేళ్లపాటు కొనసాగిన ఈ న్యాయ పోరాటంలో చివరకు విజయం దక్కింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 2019లో ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం (737 ఎంఏఎక్స్) ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో భారతీయ పౌరురాలైన శిఖాగార్గ్ మరణించారు. అప్పుడు ఐరాసలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఆమె.. యూఎన్ ఎన్విరాన్మెంట్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొనేందుకు నైరోబీకి వెళ్తున్నారు.
ఆ సమయంలో ఆమె పీహెచ్డీ కూడా చేస్తున్నారు. భారతీయ సంప్రదాయం అంటే మక్కువ చూపే శిఖ.. చీరకట్టులో విమానం ఎక్కారని ఆ రోజుల్ని కుటుంబసభ్యులు గుర్తుచేసుకున్నారు. ఆ విమానం ఇథియోపియాలోని బోలె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూలిపోయింది.
ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మొత్తం 150 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. ఇది జరగడానికి ఐదు నెలల ముందే ఇండోనేసియాలో మరో విమానం ప్రమాదానికి గురైంది. ఈ రెండు ఘటనల్లో కలిపి సుమారు 340 మంది మృతి చెందారు. వీటికి సంబంధించిన కేసుల్లో పరిహారం ఇచ్చి, చాలావరకు కేసులను బోయింగ్ పరిష్కరించుకుంది.
అయితే.. ప్రమాదానికి గురైన విమానం మోడల్ డిజైన్‌లో పలు లోపాలు ఉన్నాయని, అలాగే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించడంలో విఫలమైందని శిఖ కుటుంబం దావా వేసింది. కోర్టుల్లో ఇలాంటి దావాలు మరికొన్ని దాఖలయ్యాయి. వీటిలో శిఖ కుటుంబం వేసిన దావాపై తీర్పు వెలువడింది. పరిహారంతో పాటు అన్ని ఖర్చులు కలిపి ఆమె కుటుంబానికి 35.85 మిలియన్ డాలర్లు చెల్లించాలని షికాగోలోని ఫెడరల్ జ్యూరీ ఈ వారం తీర్పు ఇచ్చింది.