అమెరికాలో మరో విమాన ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. లాస్ ఏంజెలెస్ నుంచి అట్లాంటకు వెళుతున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్‌లో మంటలు చెలరేగిన విషయాన్ని పసిగట్టిన పైలెట్లు.. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
డెల్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 767-400 విమానం లాస్ఏంజెలెస్ నుంచి అట్లాంటాకు బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సమస్య ఎదురైంది. ఎడమవైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ఎయిర్‌పోర్టు సిబ్బందికి సమాచారం ఇచ్చి.. విమానాన్ని వెనక్కి మళ్లించారు. లాస్ఏంజెలస్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా దిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రన్ వే పైకి వచ్చి మంటలను అదుపు చేశారు.
ప్రమాద సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనేది అధికారులు వెల్లడించలేదు. ప్రమాదానికి గల కారణాలు కూడా తెలియరాలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. డెల్టా ఎయిర్ లైన్స్ ప్రతినిధి కూడా ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించారు.
ఇక, ఏప్రిల్లోనూ డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానానికి ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో అట్లాంటాకు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన ఎయిర్ పోర్టుకు సిబ్బంది మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.