పిల్లిని గదిలో బంధించి రోజూ కొడుతుంటే అది ఏదో ఒక రోజు పులిగా మారి గర్జిస్తుందనే సామెత మనం వినే ఉంటాము. అలాగే చేసింది ఓ బాలిక. ఆప్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదుల పాలిట సివంగిలా మారింది. ఉగ్రవాదులు జరిపే కాల్పులకు భయపడకుండా ఎదురుతిరిగింది. దాదాపు 40 మంది ఉగ్రవాదులను తుపాకీ పట్టుకుని ఎదిరించింది. ఆమె దాడికి ఇద్దరు ముష్కరులు నేలకొరిగారు.
ఈ ఘటన ఆప్ఘన్‌లో సెంట్రల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామంలో జరిగింది. ఆ బాలిక పేరు కమర్ గుల్. వయస్సు 16 ఏళ్లు. ఆమె తండ్రి గ్రామ పెద్దగా ఉన్నారు. ఊరిలో అందరికి న్యాయం చెప్పేవారు. అయితే అతని పెత్తనాన్ని సహించని ఉగ్రవాదులు ఆయనను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేసారు. అయితే ఉగ్రవాదుల పథకం అతనికి తెలిసిపోయి దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో కుమార్ గుల్ కుటుంబ సభ్యులను ఉగ్రవాదులు హింసించడం ప్రారంబించారు. ఈ నెల 17న ఉగ్రవాదులు వారి ఇంటికి వచ్చారు. తలుపు తట్టారు. కమార్ గుల్ తలుపు తెరవడంతో తమ తల్లి, తండ్రి ఇద్దరిని హతమార్చారు. దీంతో తీరిందని వెనుతిరిగుతుండగా కోపంతో ఉప్పొంగిన కుమర్ ఇద్దరు ఉగ్ర వాదులను హతమార్చింది. దానితో ఆగకుండా తన 12 ఏళ్ల తమ్ముడ్ని రక్షిస్తూ మిగిలినవారిపై కాల్పులు జరిపింది. వెంటనే ప్రక్కనున్న గ్రామస్తులు, ప్రభుత్వ సైనికులు అక్కడికి చేరుకొని ఆమెతో కలిసి ఉగ్రవాదులను తరిమికొట్టారు. ఆమె సాహసాన్ని అధికారులు మెచ్చుకున్నారు.