కరోనా కష్టకాలంలోనూ కామాంధులు ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మహిళలు, అమ్మాయిలపై అకృత్యాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ.. కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వ్యక్తి.. ఓ మహిళతో సహజీవనం చేస్తూనే, ఆమె కుమార్తెను రేప్ చేశాడు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా గోపాల్ నగర్‌లో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక గోపాల్ నగర్‌కు చెందిన సుభాని అనే వ్యక్తి.. అర్థవీడుకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది క్రమంగా సహజీవనంగా మారిపోయింది. అయితే, ఈ మహిళకు మైనర్ కుమార్తె ఉంది.
ఆమెపై సుభాని కన్నేశాడు. ఆ మహిళ ఇంట్లో లేని సమయంలో ఆ యువతిపై లైంగికదాడికి తెగబడ్డాడు. తన తల్లితో సహజీవనం చేస్తున్న వ్యక్తే తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, స్థానిక దిశ పోలీస్ స్టేషన్‌లో ఓ మైనర్ బాలిక ఫిర్యాదు చేసింది.
జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పినా పట్టించుకోలేదని బాలిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో ఆ బాలిక భయపడి తల్లిని వదిలి అమ్మమ్మ ఇంట్లో తలదాచుకుంది. అక్కడ జరిగిన విషయాన్ని చెప్పడంతో అమ్మమ్మ సహకారంతో దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.