సాధారణంగా చాలామంది ఒట్టి బియ్యం పిండితో ఊతప్పం, దోసెలు, ఇడ్లీలు చేస్తుంటారు. ఇలా చేస్తే పిల్లలు అంతగా ఇష్టపడి తినరు. అదే బియ్యం పిండిలోనే కొన్ని బ్రెడ్ స్లైసెస్ వేసి ఊతప్పం, దోసె వంటి వంటకాలు తయారుచేసిస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మరి ఆ ఊతప్పం ఎలా చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - 10
పాలు - 1 కప్పు
ఉల్లిపాయలు - అరకప్పు
టమోటాలు - అరకప్పు
క్యాప్సికమ్ - అరకప్పు
బంగాళాదుంప - అరకప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం ముక్క - చిన్నది
కారం - అరస్పూన్
ఉప్పు - తగినంత
గరం మసాలా - అరస్పూన్
నూనె - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా బ్రెడ్ ముక్కల అంచులను తీసి వాటిని పొడి చేసుకోవాలి. ఈ పొడి చేసిన బ్రెడ్‌ను పాలలో నానబెట్టాలి. ఆ తరువాత ఓ గిన్నెలో క్యాప్సికమ్, బంగాళాదుంప, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకుని ఇప్పుడు ముందుగా పాలలో నానబెట్టుకున్న బ్రెడ్ ముక్కలు, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఊతప్పం బాణలికి కొద్దిగా నూనెరాసి అది వేడయ్యాక ఈ మిశ్రమాన్ని అందులో ఊతప్పం వేసి కాసేటి తరువాత దించేయాలి. అంతే... బ్రెడ్ ఊతప్పం రెడీ.