వర్షాకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల మన జీర్ణక్రియ మందగిస్తుంది. కాబట్టి నూనె ఎక్కువగా గల పదార్థాలకు దూరంగా ఉండటమే మేలు. ఇక తాజా ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్లు బాగా తీసుకుంటే రోగనిరోధకశక్తి పెంపొందుతుంది. పండ్లు కూడా మంచివే. ఇవి శక్తిని అందిస్తాయి.
యాపిల్, దానిమ్మ వంటి పండ్లు తినాలి. వీటిని శుభ్రంగా కడిగాకే తీసుకోవాలి. వానకాలంలో బార్లీ, ముడిబియ్యం, ఓట్స్ తినటమూ మంచిదే. పాల పదార్థాలు సూక్ష్మక్రిముల తాకిడికి ఎక్కువగా గురయ్యే అవకాశముంది. అందువల్ల పాలకు బదులు పెరుగు తినటం మేలు. బాదంపప్పు తినటమూ మంచిదే. వానకాలంలో వాతావరణంలో తేమ అధికంగా ఉండటం వల్ల ఫంగల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ల బెడదా ఎక్కువే.
మసాలాలు శరీరంలో ఉష్ణోగ్రతను పెంచి దురద, అలర్జీలకు దారితీస్తాయి. కాబట్టి చర్మ వ్యాధులు, అలర్జీలు గలవారు ఈ కాలంలో మసాలా పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. తేమ మూలంగా చర్మం జిడ్డుగా మారుతుంది కూడా. దీంతో బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు దాడి చేసే అవకాశమూ ఉంది.
అందువల్ల ఇలాంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి దాహం వేసినా వేయకపోయినా వానకాలంలో తగినంత నీరు తాగటం తప్పనిసరి. ఈ సమయంలో నీరు కలుషితమయ్యే అవకాశమూ ఎక్కువే కాబట్టి కాచి చల్లార్చిన నీరు తాగటం అన్నివిధాలా మంచిది.