టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల నుంచి అథ్లెట్లు ఒలింపిక్ విలేజ్‌కు చేరుకున్నారు. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. అయితే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రా డుమ్మా కొట్టనున్నాడు. ఆయన జపాన్‌కు వెళుతున్నారు కానీ.. ఆ సమయంకల్లా క్వారంటైన్‌లో ఉంటారని సమాచారం.
ఈ క్రమంలోనే ఆయన ఓపెనింగ్ సెరిమొనీకి హాజరు కారని తెలిసింది. ఒలింపిక్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకలకు ప్రతి జట్టు నుంచి ఆరుగురుకి మాత్రమే అనుమతించారు నిర్వాహకులు. ఇక క్వారంటైన్‌లో ఉంటున్నవారు కూడా ప్రారంభ వేడుకలకు హాజరుకారాదని సమావేశంలో నిర్ణయించారు. ఒలింపిక్స్ గేమ్స్ సందర్భంగా క్రీడాగ్రామంలో భారత అథ్లెట్లకు మూడు అంతస్తులు ఉన్న భవనం ఇచ్చారు.
128 మందితో కూడిన భారత బృందంతో పాటు ఈ అంతస్తులో దక్షిణాఫ్రికా మరియు బెల్జియం అథ్లెట్లు కూడా షేర్ చేసుకోకున్నారు. అంటే ఈ రెండు దేశాలకు చెందిన క్రీడాకారులకు కూడా ఇదే అంతస్తులో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ఫుట్ బాల్ ప్లేయర్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రైనింగ్ సెషన్ రద్దు అయ్యింది. జట్టులోని మిగతా సభ్యులు క్వారంటైన్‌లోకి వెళ్లారు.
జూలై 21 నుంచే ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్ మరియు బేస్‌బాల్ లాంటి గేమ్స్ ప్రారంభం అయ్యాయి. ఇక టోక్యో ఒలింపింక్ విలేజ్‌లో భారతీయ క్రీడాకారులు బసచేస్తున్నారు. ఆతిథ్యం పరంగా ఎలాంటి డోకా లేదంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక భారత క్రీడాకారుల ఆహార విషయానికొస్తే.. వీరికోసం చోలే భటూరే, నాన్, ఓక్రా, వంకాయ లాంటి శాఖాహారం వడ్డిస్తున్నారట. ఇక మాంసాహారం విషయానికొస్తే ఎలాంటి సెలెక్టివ్ మెనూ లేదట. ఏదైనా తినేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం.
ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లో క్రీడాకారులు ఎక్కడైనా తిరిగేలా ఏర్పాటు చేశారు. కరోనా ఉందని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని మాత్రమే బయటకు అడుగుపెట్టాలనే నిబంధన పెట్టారు. ఈ క్రమంలోనే భారత క్రీడాకారులు మాత్రం చాలా పరిమితంగా బయట తిరుగుతున్నట్లు సమాచారం.