కొలంబోలోని ప్రేమదాస స్టేడియాలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసుకుంది. 276 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదిందించింది. ఎనిమిదో నంబరు ఆటగాడిగా బరిలోకి దిగిన చాహల్ అసాధారణ అటతీరుతో భారత్‌కు విజయాన్ని చేకూర్చి పెట్టారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అంతకుముందు లంక జట్టులో చరిత్ అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. భువనేశ్వర్, చహల్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, దీపక్ చహర్ 2 వికెట్లు దక్కించుకున్నాడు.
ఆ తర్వాత 276 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఓ దశలో ఓటమి అంచున నిలిచింది. జట్టు ఆటగాళ్లలో దీపక్ చహర్ 82 బంతుల్లో ఏడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 69 (నాటౌట్) పరుగుల ఒంటరిపోరాటంతో భారత్ 3 వికెట్లతో విజయాన్ని సాధించింది. మొత్తం 49.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.
జట్టులో సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) దూకుడుగా ఆడగా, భువనేశ్వర్ కుమార్ (28 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) చివర్లో చహర్‌కు చక్కని సహకారం అందించాడు. భారత్ 193/7తో కష్టాల్లో పడిన దశలో వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు అజేయంగా 84 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ప్రత్యర్థి బౌలర్లలో వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టాడు.