కేవలం 48 గంటల వ్యవధిలో విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం ద్వారా ముగ్గురు రోగులకు నూతన జీవితాన్ని మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ ప్రసాదించింది. ఈ వారంలో మణిపాల్ హాస్పిటల్స్- సౌత్ ఆసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ నడుమ జరిగిన ఒప్పందం ఆంధ్రప్రదేశ్‌లోని రోగులకు తగిన ప్రయోజనాన్ని అందించింది. ఈ ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌కు లివర్ స్పెషలిస్ట్- ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్; సౌత్ ఆసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ నేతృత్వం వహించారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో విజయవంతంగా మూడు అత్యంత క్లిష్టమైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను చేశారు.
ఈ శస్త్రచికిత్సలను గురించి మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ వద్ద లివర్ స్పెషలిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్; హైదరాబాద్‌లోని సౌత్ ఆసియన్ లివర్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్, అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌ప్లాంట్ ఫెలోషిప్ (లండన్) పొందిన ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ, ఏ సమయంలో అయినా, అవయవాల కోసం ఎదురుచూస్తూ నిరీక్షిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందరికీ అవసరమైనన్ని అవయవాల లభ్యత మన దగ్గర లేదు. మా బృందాలు చనిపోయిన దాతలతో పాటుగా జీవించి ఉన్న వ్యక్తుల నుంచి అవయవాలను సేకరించి రోగులకు మెరుగైన ప్రయోజనాలు అందించేందుకు కృషి చేసింది. ఈ కాలేయ మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఆర్ధికంగా మద్దతునందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలుపుతున్నాము. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా చేసిన ఈ సహాయం వల్ల రోగులకు ఎంతో మేలు జరిగింది అని అన్నారు.
ఈ ముగ్గురు రోగులు కూడా అత్యంత క్లిష్టమైన దశలో అంటే తుది దశ కాలేయ వ్యాధులతో వచ్చారు. వీరికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయకపోతే జీవించడం కష్టం. అందువల్ల, వారికి సమయానికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అత్యంత కీలకం. ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మాట్లాడుతూ, మొదటి రోగి 25 ఏళ్ల యువతి. ఆమెకు ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వచ్చింది. కాలేయం విఫలం కావడం చేత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఆమెను నా వద్దకు పంపించారు. ఆమెకు నూతన కాలేయాన్ని ఆమె భర్త నుంచి సేకరించి అమర్చాము.
ఇక రెండవ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి కుటుంబపు సహృదయం చేత సాధ్యమైంది. పూర్తి విషాదంలో కూడా ఆ కుటుంబం ఆమె అవయవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవనదాన్ ప్రోగ్రామ్ ద్వారా దానం చేయడానికి అంగీకరించారు. ఫ్యాటీ లివర్ వ్యాధి కారణంగా కాలేయం విఫలమైన ఓ 38 సంవత్సరాల యువతికి ఈ మార్పిడి చేశాము. ఇక చివరగా ఓ 45 సంవత్సరాల వ్యాపారవేత్తకు కాలేయ మార్పిడి చేశాము. ఆయన తన సొంత కుమార్తె నుంచి ఈ కాలేయం అందుకున్నారు. ఎలాంటి ఆందోళన, భయం లేకుండా ఆమె తన కాలేయం దానం చేశారు. ఆమె కాలేయంలో దాదాపు 64% తొలగించి ఆమె తండ్రి ప్రాణాలు కాపాడాము. ఈ ముగ్గురు రోగులతో పాటుగా ఇద్దరు దాతల ఆరోగ్యం స్ధిరంగా ఉండటంతో పాటుగా చక్కగా కోలుకున్నారు అని అన్నారు.
మణిపాల్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ 2016 నుంచి విజయవంతంగా 40 కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలను చేసింది. వీటిలో 35 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను మరణించిన వ్యక్తుల నుంచి సేకరిస్తే, ఐదు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించి చేశాము. వీటిలో మూడు పిడియాట్రిక్ కేసులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి సహాయనిధి తరచుగా ఈ ప్రాంతంలో కాలేయ మార్పిడి రోగుల ఖర్చులను భరిస్తుంది. మా సమగ్రమైన కాలేయ మార్పిడి కేర్ యూనిట్, ఈ ప్రాంతంలో వైద్య సేవల పంపిణీని శక్తివంతం చేస్తుంది. లివర్ స్పెషలిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ టామ్ చెరియన్ నేతృత్వంలోని సౌత్ ఆసియన్ లివర్ ఇనిస్టిట్యూట్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ రోగులకు అసాధారణ నైపుణ్యం, కృషితో మణిపాల్‌హాస్పిటల్స్, విజయవాడ లోని డాక్టర్లు చికిత్సనందించారు అని అన్నారు.