వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. బరువును తిండితోనే కట్టడి చేయాలి. విచిత్రంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం.
ఎందుకంటే నెమ్మదిగా భోజనం చేసేవారికి ఊబకాయం వచ్చే అవకాశం తగ్గుతున్నట్టు పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సాధారణంగా మనం భోజనం చేస్తున్నప్పుడు కడుపు నిండింది. ఆకలి తీరింది. ఇక తినటం చాలించాలి అనే సంకేతాలు మెదడుకు చేరటానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది. అదే వేగంగా భోజనం చేశామనుకోండి. కడుపు నిండిందనే సంకేతాలు మెదడుకు అందే లోపే అవసరమైన దానికన్నా ఎక్కువ తినేసి ఉంటామన్నమాట.
కాబట్టి నెమ్మదిగా కనీసం 30 నిమిషాల సేపు భోజనం చేయటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఒక్కో ముద్దను 15-30 సార్లు బాగా నమిలి తినటం ద్వారా నెమ్మదిగా భోజనం చేసినట్టు అవుతుంది. అంతేకాదు, పోషకాలు కూడా బాగా ఒంటపడతాయి.