Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోటస్‌పాండ్‌లో షర్మిల సమావేశం: ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్‌ ఫొటోలు లేవు

Advertiesment
Sharmila
, మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (14:20 IST)
హైదరాబాద్‌: వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనాన్ని లోటస్‌పాండ్‌లో ప్రారంభించారు. అంతకుముందు ఆమె వేదికపైకి వచ్చి తనను కలిసేందుకు వచ్చిన నాయకులు, అభిమానులకు అభివాదం చేశారు. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మీడియాలో గత రెండు వారాలుగా చెప్పినటువంటి కథనాలు నిజమవుతున్నాయి.
 
షర్మిల కొత్త పార్టీకి సంబందించి పూర్తిగా రూపకర్తగా ఉన్నటువంటి ఆమె భర్త అనిల్.. షర్మిలతో పాటే బయటకు వచ్చి పోడియం ఎక్కించే వరకు ఉన్నారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి, వైఎస్ అభిమానులను కలుసుకోవడం.. ఇదంతా బ్రదర్ అనిల్ నేతృత్వం, ఆయన మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నట్లుగా సమాచారం.
 
అయితే ఇవాళ ఒక సమావేశంతోనే పరిమితం అవుతున్నట్లుగా తెలుస్తోంది. 150 మంది ముఖ్య నేతలతో షర్మిల సమావేశం నిర్వహిస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి షర్మిల వచ్చినట్లుగా తెలియవచ్చింది. షర్మిల ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీ, వైఎస్ రాజన్న రాజ్యం’ అనే రెండు పేర్లతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు సమాచారం
 
రాజన్న రాజ్యం తెస్తా..వైఎస్ షర్మిల
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైఎస్‌ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడుతూ... ’‘ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు. తెలంగాణలో వైఎస్సార్‌ లేని లోటు ఉంది.
 
తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడా. మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు నిర్వహిస్తా. త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తా’’ అని షర్మిల తెలిపారు.
 
ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు. బాణ సంచా కాలుస్తూ.. నృత్యాలతో సందడి చేశారు. వైఎస్సార్‌ అభిమానులారా తరలి రండి.. అని గతంలో వైఎస్‌తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పని చేసిన వారికి షర్మిల తరఫున ఫోన్‌ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు.
 
ప్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్‌ ఫొటోలు లేకుండా.. షర్మిల ఫొటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్‌ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై షర్మిల క్లారిటీ ఇచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

LPG Gas cylinder: ఎంత పెంచినా కొంటున్నారుగా, ఇక ఇలా వడ్డిద్దాం, ప్రతివారం గ్యాస్ సిలిండర్ ధరల మోత