ఇప్పటి వరకు అప్పుడప్పుడు పెరుగుతూ వస్తున్న గ్యాస్ సిలిండర్ ధరలు ఇకపై వారం వారం మోతెక్కనున్నాయి. గ్యాస్ ధరల విషయంలో పెట్రోలు, డీజిల్ పద్ధతిని అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా పెట్రో రేట్లను ప్రతీ రోజూ సవరిస్తుండగా, గ్యాస్ ధరలను మాత్రం తొలి దశలో వారానికి ఒకసారి కానీ, 15 రోజులకు ఒకసారి కానీ మార్చాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించింది.
గతేడాది డిసెంబరులో రెండుసార్లు గ్యాస్ ధరలను పెంచిన ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్‌పై ఏకంగా రూ. 100 పెంచింది. ధర భారీగానే పెరిగినా ప్రజల నుంచి వ్యతిరేకత లేకపోవడంతో ఏప్రిల్ నుంచే రోజు వారీ ధరల సవరణ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, తొలి దశలో మాత్రం 15 రోజులకు ఒకసారి ధరలను సవరించనుండగా, ఆ తర్వాత వారానికి ఒకసారి సవరిస్తారు.
చివరిగా దానిని రోజువారీకి మారుస్తారు. అయితే, ఈ విధానంపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు ఒక ధర, డెలివరీ చేసేటప్పుడు ఒక ధర ఉంటుందని, కాబట్టి ఇబ్బందులు తప్పవని ఎల్పీజీ డీలర్ల సంఘం అధ్యక్షుడు అశోక్ కుమార్ పేర్కొన్నారు.