దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నేపాల్‌కు చెందిన ఓ కుటుంబం మోతిహరీ గ్రామంలో నివాసముంటోంది. తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	అది గమనించిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు విగతజీవిగా పడిఉన్న బాలికను ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది.
	 
	బాలిక చనిపోయిందని తెలుసుకున్న నిందితులు.. మృతదేహాన్ని వెంటనే దహనం చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించి.. బాలిక మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. అనంతరం సాక్ష్యాధారాలు లభించకుండా చుట్టూ ఉప్పును చల్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే బాధితురాలి తండ్రి హత్యాచారంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. 
	 
	ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని 11 మంది నిందితులను గుర్తించి.. వీరిలో నలుగురిపై సామూహిక అత్యాచార అభియోగం మోపారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్ చేశామని.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.