అతడు ఓ సాధారణమైన రికార్డింగ్ ఆర్టిస్టు. తొమ్మండుగురు సంతానంలో అతను ఏడోవాడు. పసితనంలో అనుభవించిన పేదరికం.. హృదయ లోతుల్లో ఉన్న భారమైన బతుకు చిత్రాలు, మనసు పొరల్లో దాగి ఉన్న పేదరికపు విషాద ఛాయలు... ఇలా అన్నీ కలిసి అతడిని ఓ మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి.
"అగాధమగు జలనిధిలోనే ఆణిముత్యమున్నటులే..." అని మన మహాకవి అన్నట్లే, ఆ అగాధపు లోయల నుంచి వెలికి వచ్చి శిఖరాలను అధిరోహించిన పాప్ ప్రపంచపు రారాజే మైఖేల్ జోసఫ్ జాక్సన్. పాప్ ప్రియులు అతడిని పిలుచుకునే ముద్దుపేరు మైఖేల్ జాక్సన్. పాప్ ప్రపంచంలో ఇంకా ఎన్నో పాప్ సెంచరీలు చేయాల్సిన మైఖేల్‌ను మృత్యువు అర్థ సెంచరీలోనే కబళించింది. ఎందరో అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చి అతను తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు.
మైఖేల్ జాక్సన్ పుట్టింది ఆగస్టు 29, 1958. తొమ్మిదిమంది సంతానంలో మైఖేల్ ఏడోవాడు. మైఖేల్ తండ్రి జాక్సన్‌ను ముద్దుగా "బిగ్ నోస్" అని పిలిచేవారట. అధిక సంతానం, చాలీచాలని సంపాదన మైఖేల్ సోదరులకు బాల్యంలోనే దారిద్య్రాన్ని రుచి చూపించాయి. అంతే... వాటిని అధిగమిస్తూ "అమేజింగ్ జాక్సన్-5" వెలుగులోకి వచ్చారు. విషాదపు అనుభవాల గొంతుకల నుంచి వినోద గీతికలు జాలువారాయి. ఆ గొంతుకలలో ఒకే ఒక్క స్వరం పాప్ ప్రియులను మరింత హత్తుకుంది. అంతే.. పాప్ లోకంలో పెద్ద మెరుపు. ఓ గొప్ప వెలుగు. ఆ కాంతివైపు పాప్ ప్రియులు తమ దృష్టిని సారించారు. ఆ కాంతి నుంచి వెలికి వచ్చిన ఓ తేజోవంతమైన కిరణమే మైఖేల్ జాక్సన్.
విభిన్నమైన బాణీ, వినూత్నమైన సంగీతం... మైఖేల్‌ను సూపర్‌స్టార్ చేశాయి. తనకు 11 ఏట వచ్చేసరికి పాప్ ప్రపంచపు రారాజు అతనే అయ్యాడు. 14వ ఏటలో తనకుతాను బాణీలను కూర్చుకుని అంతర్జాతీయ వేదికలపైకి దూసుకు వచ్చాడు. హృదయాలను ఆకట్టుకునే రచనలతో శ్రోతలను ఉర్రూతలూగించాడు. మొట్టమొదటి ప్రేమ పాట "బెన్" సూపర్ డూపర్ హిట్టయింది.
ఆ తర్వాత మైఖేల్ తన శరీరరంగుపై దృష్టి పెట్టాడు. తన తండ్రి చిన్నతనంలో తనను "పెద్దముక్కు" అని అన్నందుకో ఏమోగానీ మైక్ తన ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఐబ్రోస్ షేప్ చేయించుకున్నాడు. అయితే ముక్కుకు మాత్రమే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడంతో ముక్కు ప్రాంతం తెల్లగా మారిపోయింది. దీంతో అందరూ మైక్‌ను ఆఫ్రికన్-అమెరికన్ అని గేలి చేయడం మొదలుపెట్టారు.
అయితే ఆ తర్వాత తన శరీరాన్ని మొత్తం తెలుపు రంగు వచ్చే విధంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అమెరికన్-ఆఫ్రికన్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత అతడిని ఎగతాళి చేసే జనమే లేకుండా పోయారు. మైఖేల్ ఎక్కడ పాప్ షోలను ఏర్పాటు చేసినా ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయేది.
1979లో "ఆఫ్ ది వాల్ ఆల్బమ్"తో తన పాప్ కెరీర్‌కు పటిష్టమైన "వాల్"ను నిర్మించుకున్న మైఖేల్ ఆ తర్వాత 1987లో "బ్యాడ్"తో ప్రపంచంపై పాప్ దండయాత్రను కొనసాగించాడు. మైఖేల్ ఆలపించిన ప్రతి పాటా ఓ రికార్డే. అతని పాటలకే కాదు అతని ఫోటోలకు సైతం అంతర్జాతీయంగా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో పెప్సీ, ఎల్ఎ గేర్ స్పోర్ట్స్‌వేర్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు మైఖేల్ ఇంటి ముందు క్యూ కట్టాయి.
కావలసినంత డబ్బు... ఎల్లలు దాటిని ఖ్యాతి. ఇక తనకు కావలసినదేమున్నది... అంతే! అనాధలైనవారిని ఆదుకునేందుకు నడుం బిగించాడు మైఖేల్. తను చేయగలిగిన సాయం చేయనారంభించాడు. ప్రపంచవ్యాప్తంగా జాక్సన్ స్థాపించిన అనాధ శరణాలయాలు ఎన్నో ఉన్నాయి.
ఇక పాప్ ప్రపంచంలో మైఖేల్ సృష్టించిన ప్రభంజనానికి గుర్తుగా ఆయనను ఎన్నో అవార్డులు వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో ఆయన ఖ్యాతి నమోదైంది. అంతేకాదు "మోస్ట్ సక్సస్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ఆల్ టైమ్" పేరిట 13 గ్రామీ అవార్డులను ఆయన అందుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలు పాటు ప్రపంచ పాప్ శ్రోతలను ఉర్రూతలూగించిన మైఖేల్ కేవలం 50 ఏళ్లకే(జూన్ 25, 2009) పరమపదించడం విషాదం.