ఒక నెల రోజులుగా తనతో కలిసివుంటున్న ప్రియురాలు ఉన్నట్టుండి తల్లిదండ్రులతో కలిసి వెళ్ళేందుకు ఇష్టపడటాన్ని ఆ ప్రియుడు జీర్ణించుకోలేక పోయాడు. దీంతో కోర్టుహాలులోనే చేతి మణికట్టు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాకు చెందిన విష్ణు (31) అనే యువకుడితో 23 యేళ్ల యువతి గత నెల రోజులుగా సహజీవనం చేస్తుంది. దీంతో యువతి తండ్రి కోర్టును ఆశ్రయించి, హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ యువతీ యువకుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా జరిగిన విచారణలో యువతి తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఇష్టపడింది. తాను తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్తానని న్యాయమూర్తి అను శివరామన్, సి.జయచంద్రన్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపింది. విష్ణును చూస్తే తనకు సోదరభావం తప్ప రొమాంటిక్ ఫీలింగ్స్ కలగడం లేదని స్పష్టం చేసింది.
అతడు తనను బెదిరించడం వల్లనే తాను కలిసి ఉన్నానని చెప్పింది. విష్ణుకు ఇప్పటికే వివాహమైందని, అయితే, అది చెడిపోయిందని చెప్పి తనను మోసం చేశాడని ఆమె కోర్టుకు తెలిపింది. దీంతో విష్ణు.. తన జేబులో దాచుకున్న కత్తి తీసి కోర్టు హాలులోనే చేతి మణికట్టును కోసుకున్నాడు. దీంతో అతడిని పోలీసులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.