అమెరికాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన టెక్ ఎంటర్‌ప్రెన్యూయర్ ఒకరు తన భార్యను, కుమారుడుని తుపాకీతో కాల్చి చంపేసి, ఆ తర్వాత తాను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు కోల్పోయాడు. వాషింగ్టన్ రాష్ట్రంలోని న్యూకాజిల్ పట్టణంలోని వారి నివాసంలోనే ఏప్రిల్ 24వ తేదీన ఈ విషాదకర ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, మృతులను హర్ష వర్ధన్ ఎస్ కిక్కేరి (57), ఆయన భార్య శ్వేతా పాణ్యం (44), వారి 14 యేళ్ల కుమారుడుగా గుర్తించారు. ఈ ఘటన జరిగిన సమయంలో వీరి మరో కుమారుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలు నిలిచాయి. హర్షవర్థన్ తొలుత భార్యను, ఆ తర్వాత కుమారుడున కాల్చి చంపేశాడు. ఆ తర్వాత అదే తుపాకీతో తాను కూల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ దారుణానికి పాల్పడటానికి స్పష్టమైన కారణాలు ఏమిటన్నది ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని కింగ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఆ కుటుంబం అందరితో స్నేహంగానే మెలిగేదని, అయితే తమ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా ఇతరులతో పంచుకునేవారు కాదని పొరుగువారు చెప్పినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.