ఓ మహిళ వివాహమైన తర్వాత ప్రేమలో పడింది. ఆ తర్వాత అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తన ప్రేమకు అడ్డుగా ఉన్నాడని, తమమధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుందని భావించి, ప్రియుడితో కలిసి భర్తను మట్టుబెట్టింది. చివరకు ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తోంది. ఈ దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో వెలుగు చూసింది.
షాద్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఫరూక్ నగర్ మండలం చిన్న చిల్కమర్రికి చెందిన ఎరుకలి యాదయ్య (32)కు మౌనిక అనే యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే, భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో భర్త మద్యానికి బానిసయ్యాడు.
అదేసమయంలో ఓ పరిశ్రమలో పనిచేస్తున్న అశోక్‌తో మౌనికకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకుదారితీసింది. ఆ తర్వాత వారిద్దరూ ఏకాంతంగా కలుస్తూ వచ్చారు. ఈ విషయం భర్తకు తెలిస్తే అంగీకరించడని భావించి, అతని అడ్డు తొలగించుకోవాలని వారిద్దరూ ప్లాన్ వేశారు. తమ కుట్రలో భాగంగా, గత ఫిబ్రవరి నెల 18వ తేదీన యాదయ్యను కొత్తూరు మండలం గూడూరుకు తీసుకెళ్లి పీకల వరకు మద్యం తాగించి గొంతుకోసి చంపేశారు. అక్కడే మృతదేహాన్ని ఓ గుంతలో పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
అయితే, పొలానికి వెళ్లిన తన భర్త ఇంటికి రాలేదని పేర్కొంటూ మరుసటి రోజున మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేసమయంలో మౌనిక గ్రామం వదిలి షాద్ నగర్‌లోని అయ్యప్ప కాలనీలో ఉండే అశోక్‌తో కలిసి ఉన్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో మౌనికను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆమెతో పాటు ఆమె ప్రియుడుని పోలీసులు అరెస్టు చేశారు. మృతుడి పుర్రె, ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.