ప్రభుత్వ ఉద్యోగం అంటే.. కాలు మీద కాలేసుకుని హాయిగా బ్రతికేయవచ్చు అంటుంటారు చాలామంది. కానీ కొంతమంది ప్రభుత్వోద్యోగులు అనుకోకుండా సమస్యల్లో ఇరుక్కుంటుంటారు. అది కాస్తా జీవితాన్ని చిధ్రం చేసేస్తుంది. ఇలాంటి విషాదకర సంఘటన కావలిలో చోటుచేసుకుంది.
ప్రకాశం జిల్లా పెదపవని పోస్టాఫీసులో పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న 31 ఏళ్ల ఫణికుమార్ కావలిలో భార్యాపిల్లలతో కలిసి వుంటున్నాడు. భార్య ఉషారాణి కూడా గ్రామసచివాలయంలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తోంది. ఐతే ఫణికుమార్ తన ఉద్యోగం చేస్తూనే ఇతర వ్యాపారాలపై దృష్టిపెట్టాడు. కానీ ఆ వ్యాపారాల్లో తీవ్రంగా నష్టపోయాడు.
తెచ్చిన అప్పులకు వడ్డీలు మోపెడై వచ్చే జీతం కూడా మిగలని పరిస్థితి తలెత్తింది. దీనితో తీవ్రమైన మానసకి వేదనకు గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో పిల్లలు పెద్దగా ఏడుస్తూ వుండటంతో పొరుగువారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.